సిరిసిల్లలో తెలంగాణ ఫోక్ అసోసియేషన్ ఆవిర్భావం.. నవంబర్ 3న భారీ సాంస్కృతిక కార్యక్రమం
సిరిసిల్లలో తెలంగాణ ఫోక్ అసోసియేషన్ ఆవిర్భావం.. నవంబర్ 3న భారీ సాంస్కృతిక కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ ఫోక్ అసోసియేషన్, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి సినిమా పరిశ్రమలో జానపద కళలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, జానపదం లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదన్నారు. సినిమా పరిశ్రమకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీల మాదిరిగానే జానపద కళాకారులకు కూడా ప్రత్యేక రాయితీలు కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
జానపద కళాకారులు సరైన ఆర్థిక పెట్టుబడులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సొంత డబ్బులతో పాటలు, చిన్న కథలు, మినీ సినిమాలు రూపొందిస్తున్నప్పటికీ ఆశించిన ఆదాయం రాక నష్టాలను చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జానపద కళాకారులను గుర్తించి వారికి ఆర్థిక సహకారం, ప్రోత్సాహకాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ రంగంలో పనిచేస్తున్న 24 క్రాఫ్ట్స్‌కు చెందిన కళాకారులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ఫోక్ అసోసియేషన్, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీకి సిరిసిల్ల వేదికగా శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా నవంబర్ 3వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భారీ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 100 మంది ప్రముఖ జానపద కళాకారులు నాలుగు గంటల పాటు తమ కళాప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారని పేర్కొన్నారు.
కళాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు జానపద కళలకు తగిన గుర్తింపు, గౌరవం, ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఇప్పటికే రాష్ట్రస్థాయి కమిటీ కార్యవర్గ సమావేశం నిర్వహించామని, అసోసియేషన్ విధివిధానాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, కళాభిమానులు, కళాపోషకులు పెద్ద సంఖ్యలో హాజరై జానపద కళాకారులకు అండగా నిలిచి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు మనస్ఫూర్తిగా కోరారు.